1672-87 ప్రాంతంలో గోల్కొండ రాజ్యమును అబ్దుల్ హాసన్ కుతుబ్ షా పాలించారు. వీరికి తానిషా అని మరొక పేరు ఉంది. వీరు కవులు, కళాకారులను చాలా గౌరవించేవారు. వీరి కొలువులో అక్కన్న-మాదన్న అనే మంత్రులు ఉండేవారు. క్షేత్రయ్య, రామదాసు వీరి కాలంలోని వారే. ఒకనాడు తానిషావారు బండారు ప్రాంతంలో పర్యటించి పరివారంతో బయలుదేరి మార్గ మధ్యమున కూచిపూడి గ్రామం సమీపంలో విశ్రమించారు. తెల్లవారు ఝామున వీరికి చక్కని గానము చెవులకు వినబడగా భటులను పంపి గాయకులను తీసుకురమ్మన్నారు. భటులు ఆ భాగవతులను తీసుకురాగా తానిషావారు వారిని పాడమన్నారు. వారి గానామృతానికి, నాట్య ప్రదర్శనకు చాలా ఆనందపడి కూచిపూడి అగ్రహారమును దానము ఇచ్చారు. ఆ దానశాసనములో ఉన్న కూచిపూడి భాగవత కుటుంబీకులు, భాగవతుల, ఏలేశ్వరపు, హరి, మహంకాళి, పోలేపెద్ది, వేదాంతం, పసుమర్తి, వెంపటి, వల్లభ జ్యోస్యూల, వేము, జోశ్యుల, బొక్క, దర్భ మొదలైన ఇంటిపేర్ల వారు ఉన్నారు. 1763 తర్వాత చింతా వారు వలస వచ్చారు.