ఓంకారాత్మకుడైన ఆ పరమేశ్వరుని సంకల్ప శుద్ధితో ప్రారంభమై యుగయుగాలుగా ప్రవర్ధమానమవుచూ భరతుడు వంటి పదహారు మంది నాట్యశాస్త్ర కర్తలచే సర్వాలంకార సుందరంగా, సర్వలక్షణ సులక్షితంగా తీర్చిదిద్దబడి, లలితకళలతో సమ్మిళితమైన సమాహార కళా స్వరూపముగా ఉన్నది నాట్యకళ. ఈ కళను గూర్చి ”భరతమహర్షి’ తన నాట్యశాస్త్రం అను గ్రంధంలో పుట్టు పూర్వోత్తరములు వివరంగా తెలిపినాడు.

స్వాయంభువ మన్వంతరము నుండి వైవస్వత మన్వంతరం వరకు 7 మన్యంతరములు. ప్రతి మన్వంతరం నందు కృతయుగం అంతమై త్రేతాయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో ప్రజలు కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యములు అనే అరిషడ్వర్గములకు లోనై గ్రామ్య ధర్మ ప్రవృత్తిని అవలంబిస్తూ స్వధర్మమును వదిలిన వారై సుఖ దుఃఖ సమ్మిళితములైన జీవితములను గుడుపుతూ ఉంటారు. ఈ పరిస్థితి  ప్రతి మన్వంతరంలోను కృత, త్రేతా యుగముల సంధి కాలంలో జరుతూ ఉండేది. పూర్వం త్రేతాయుగం ప్రారంభమయ్యే సమయంలో పై సందర్భమే జంబూద్వీపములో సంభవించినపుడు, దేవతలు, గంధర్వులు, యక్షులు, రక్షోగణములు, మహోరగులు ఆక్రమించుకొని ఉండగా ఈ భూలోకంలో ధర్మ – ప్రతిష్టాపన కోసం జన్మించిన ప్రజలను తమ ధర్మమును గుర్తు చేసే ప్రయత్నం చేస్తుండగా, దీనంతటిని చూసి మహేంద్రుడు మొదలైన దేవతలందరూ కలిసి పితామహుడైన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ క్రింది విధంగా ప్రార్ధించిరి.

క్రీడనీయక మిచ్చామో దృశ్యం శ్రవ్యంచ యద్భవేత్”

అనగా చూడదగిన, వినదగిన వినోద వస్తువును కోరుచున్నాము. సూద్రజాతులకు ఈనాటి వేదములపై అధికారం లేదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే వేరొక వేదమును సృష్టించండి. అని కోరినారు. అందుకు బ్రహ్మదేవుడు సానుకూలముగా స్పందించి, చతుర్వేదములను స్మరించెను;

ధర్మ ప్రతి పాదకము, చతుర్విధ పురుషార్ధ సాధకము, యశస్కరము, ఉపదేశ్య సహితము, సమ్యక్ జ్ఞాన ప్రదము, ముందు తరాల వారికి సత్కర్మమార్గమును ప్రదర్శించగలిగేది, సర్వ శాస్త్ర సంపన్నము, సర్వశిల్ప ప్రవర్తకము, ఇతిహాస సహితము అగునట్లుగా “నాట్యము” అనే పంచమ వేదమును సృష్టించదలిచి,

ఋగ్వేదము నుండి పాఠ్యమును, యజుర్వేదము నండి అభినయమును, సామ వేదము నుండి సంగీతమును, అధర్వణవేదము నుండి రసమును గ్రహించి వేదోప వేదములకు సంబంధించి యుండునట్లుగా లలితాత్మకమైన పంచమ వేదముగా నాట్య వేదమును సృష్టించినాడు.

పిమ్మట బ్రహ్మ, ఇంద్రుడిని పిలిపించి, తాను సృష్టించిన పంచమ వేదమును దేవతలకిచ్చి, గ్రహణ ధారణ యోగ్యులు, ఊహాపోహసమర్థులు, సభాకంపము లేనివారు, వ్యాయామాభ్యాసములచే అలసట లేనివారు. సముచిత దేహం కలవారైన వారికి దీనిని ఇవ్వమని చెప్తారు. 

[గ్రహణ = గురుముఖతః గ్రహించుట; ధారణ = గ్రహించిన దానిని మర్చిపోకుండా ఉండుట ]

అప్పుడు గ్రహణ, ధారణ యందు సమర్థుడైన భరతమహర్షిని రప్పించి ‘పుత్రసహితుడైన నీవు దీనికి ప్రయోక్తవు కమ్ము’ అని ఆదేశించగా ఆయన సమ్మతించి, తన వందమంది శిష్యులకు ఈ నాట్యకళను ప్రయోగపూర్వకముగా నేర్పించినాడు.

భరతుడు నాట్యాచార్యుడై తన వందమంది శిష్యులు అభినయిస్తూ ఉండగా, బ్రహ్మచే సృష్టింపబడిన 24 మంది అప్సరసలు తమ నృత్యముతో, స్వాతిముని వాద్య సహకారంతో, నారదుడు మొదలైన వారు గానములతో సహాయం అందించారు. ఇలా తొలినాట్యమేళం తయారయినది. 

వీరందరూ బ్రహ్మదేవుని అనుజ్ఞతో మహేంద్రుని ధ్వజత్సవము రోజున “అమృతమధనం” అనే నాట్యాన్ని ప్రదర్శించారు. తర్వాత ‘త్రిపుర దాహం’ అనే నాటకాన్ని పరమేశ్వరుని సమక్షంలో ప్రదర్శించినారు. అప్పుడు ఈశ్వరుడు ఈ నాటకానికి నృత్యాన్ని జతచేస్తే ఇంకా బాగుంటుందని ఆలోచించి తండువుని పిలిపించి భరతమునికి -నృత్యాన్ని నేర్పించవలసిందిగా ఆదేశిస్తాడు. తండువు భరతమునికి నృత్వాన్ని నేర్పించినాడు. ‘తండువు నేర్పినది కావునా అది తాండవం అనబడినది. గీతాలలో నృత్యం చేరడం వలన అర్ధములను ప్రదర్శించడం మరింత సులభము అయినది. ఇలా ఉద్భవించిన నాట్యం భరతముని యొక్క శిష్యుల ద్వారా భూలోకానికి కూడా వ్యాప్తి చెందినది.

By admin