“నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం – నాట్య శాస్త్రం”
భరతముని రచించిన నాట్యశాస్త్రం ప్రకారం నాట్యం అనగా నాటకమే. ఇది పూర్వ కథలతో కూడి ఉంటుంది. అనగా రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల నుండి ఒక కథను తీసుకుని దానిని కొంత మంది పాత్రదారులచే అందులోని పాత్రలను తగినవిధముగా నటింపచేసి ప్రేక్షకులకు అందించే విధానమే నాట్యం.
ఉదాహరణకు రామ నాటకం, కీచక వధ, మొ||
“భావాభినయ హీనంతు నృత్తమిత్యభిధీయతే”
భావము, అభినయము లేనిది, తాళము, లయ గతులను అనుసరించి సాగేది నృత్తము అనబడుతుంది. నాట్యం నేర్చుకునే చిన్నారులు నృత్యాంశాలలోకి రాక ముందు ప్రాధమికముగా నేర్చుకునే అడుగులు, జతులు మొదలైనవి నృత్తము అనబడతాయి. జతిస్వరములు లాంటి అంశాలు కూడా.
“రస భావ వ్యంజనాదియుక్తం నృత్య మితీర్యతే”
రసము, భావము, అభినయము అన్నీ కలిగి తాళము, లయను అనుసరిస్తూ చేసేది నృత్యము. ఇది అందముగా ఉంటూ ప్రేక్షకులను ఆనందింపజేస్తుంది. కూచిపూడి నాట్యములో చేసే వ్యస్థ నృత్యాంశాలు
(solo dances) నృత్యము క్రిందకు వస్తాయి. పూర్వము రాజుల ఆస్థానాలలో నృత్యాలను ప్రదర్శించేవారు.
“సుకుమారంతు తల్లాస్యం”
సుకుమారముగా చేయు పద్దతిని లాస్యము అంటారు. అనగా అభినయమునకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ చేసేది. దీనికి అధిదేవత పార్వతీదేవి. ఇందులో అవయవాల కదలికలు మనోహరముగా ఉండి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తాయి.
“ఉద్ధతం తాండవం విధుః”
ఉద్ధతమైన ప్రయోగాలు కలది తాండవం అనబడుతుంది. దీనికి అధిదేవత శివుడు. అంతేగాక తండువు చేత చెప్పబడినది కావునా “తాండవం” అనబడినది. ఇది ప్రేక్షకులలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది.