“నాట్యం భిన్నరుచేర్జనస్య బహుదాప్యేకం  సమారాధనమ్ “

అని కాళిదాసు మాట. అనగా భారతదేశంలో విభిన్న నృత్య రీతులు ఉన్నప్పటికీ అవి ప్రజల చేత మన్ననలు పొందుతూనే ఉన్నాయి. ప్రాంతీయతా బేధములతో ఎన్ని నృత్య రీతులు ఉద్భవించినా వాటి యొక్క పరమావధి ఒక్కటే.

శ్లోకం: దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వీనాం | విశ్రాంతి జననే కాలే నాట్యమే తత్భవిష్యతి ||

అలసి సొలసిన వారికి కొంత విశ్రాంతిని కలిగించి తాము అనుభవిస్తున్న వేదనకు కొంత ఊరట కాలగిస్తూ ప్రజలకు జ్ఞాన బోధ చేస్తున్న నాట్య రీతులు అన్నిటికీ భరతుని నాట్యశాస్త్రమే పూర్తిగానో, పక్షికంగానో ఆధార గ్రంధము. ఈ నాట్యరీతుల గురించి తెలుసుకుందాము.

భారతదేశంలో ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం, కధకలి, ఒడిస్సీ, మణిపురి, మోహినియాట్టం, కధక్, సత్రియ, చౌ నృత్యం వంటివి గుర్తింపు పొందిన పొందిన ప్రసిద్ధ శాస్త్రీయ నాట్యరీతులు. వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.

Yamini Machiraju - Kuchipudi Dancer
  1. కూచిపూడి

ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే చిన్న గ్రామంలో కూచిపూడి నాట్యం,  నాట్య(నాటక) సంప్రదాయంతో ప్రారంభమైంది. కూచిపూడి గ్రామంలో కొన్ని సంప్రదాయ భాగవత కుటుంబాల వారు తరతరాలుగా ఈ కళను అభివృద్ధి చేస్తూ వచ్చారు. భగవంతుని కధాలను వీధులలో ప్రదర్శిచువారు కావున వీరికి వీధి భాగవత్తులు చాలా కాలంగా పౌరాణిక ఇతివృత్తాలతో కూడిన నృత్య నాటకాలు మాత్రమే ప్రదర్శించబడ్డాయి. భామకలాపంలోని సత్యభామ మరియు ఉషాపరిణయం లోని ఉష వంటి పాత్రలకు ప్రవేశ దరువులు మరియు కృష్ణలీలా తరంగిణి నుండి తరంగనృత్యములు వంటి కొన్ని వ్యస్త(సోలో) అంశాలు నృత్య నాటక ప్రదర్శనలో వైవిధ్యంగా మరియు వ్యక్తిగత కళాకారుల ప్రతిభను కనబరిచాయి. కూచిపూడి నృత్యం అనేది అభినయ (భావవ్యక్తీకరణ) ప్రాధాన్యంగా ప్రదర్శించబడే నాట్యకళ. కూచిపూడి నృత్యంలో కౌత్వం, జతిస్వరం, శబ్దం, కీర్తనలు, అష్టపదులు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు, తరంగం, శ్లోకం, జావళిలు, దరువులు మొదలైన అనేక రకాల ప్రదర్శనలు చేస్తారు.

కూచిపూడిలో ప్రసిద్ధ గురువులు వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, వెంపటి వెంకట్ నారాయణ, చింతా వెంకట రామయ్య వీరిని కూచిపూడి సంప్రదాయ నాట్య త్రయం అని పిలుస్తారు. ఇతర ప్రముఖ గురువులు వెంపటి చిన సత్యంగారు , వేదాంతం సత్యనారాయణ శర్మగారు , PVG కృష్ణ శర్మ గారు  మరియు పలువురు.

Bharathanatyam
2. భరతనాట్యము

భావ-రాగ-తాళ సమన్వితమైన నృత్యరీతి భరతనాట్యము అని పేరొంది తమిళనాడు ప్రాంతములో అభివృద్ధి చెందిన కళా సంప్రదాయము భారతనాట్యము. పూర్వము ఈ కళను సదిర్, నాట్ చ్, ఆటకుత్తు, దాసి ఆట,   చిన్న మేళం, తంజావూరు నాట్యం అని పిలిచేవారు. ఇది “నృత్తప్రధానము” అనగా నాటకానికి తావులేని నృత్య సంప్రదాయము ఇది. కానీ ఇందులో నాట్యము అనే శబ్దము నృత్యమునకు పర్యాయ పదము మాత్రమే. క్రీ.శ. 1798-1824 ప్రాంతంలో తంజావూరును పాలించిన శరభోజీ పరిపాలనలో ఆస్థాన నర్తకులుగా ఉన్న పొన్నయ్య, చిన్నయ్య, వడివేలు, శివానందం అను నలుగురు సోదరులు ఈ నాట్యమునకు పితమహులైనారు. అలరింపు, జతిస్వరం, శబ్ధం, వర్ణం, పదం, తిల్లానా వంటి అంశములు ప్రదర్శిస్తూ ఒక నర్తకి 2 గంటల సమయము ప్రదర్శించునట్లు ఈ కళను నేర్చుకుంటారు. ఈ సంప్రదాయంలో గురువును “నట్టువనార్” అంటారు. ఇందులో క్షేత్రయ్య పదములు, పురందరదాసు కీర్తనలు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ కృతులకు, ధర్మపురి వారి జావళులకు, అన్నమయ్య కీర్తనలు, స్వాతి తిరునాళ్ కృతులకు తిల్లానాలకు చక్కని అబినయమును చూపబడును. ఇందు ఆహార్యం ఇంచుమించు కూచిపూడి వారివలె ఉండును. వాద్యబృందం (మృదంగము, వాయులీనము, వేణువు, వీణ) కూడా సమానమే. ప్రముఖులు: శ్రీమతి బాల సరస్వతి, రుక్మిణీ దేవి అరుండెల్, యామినీ కృష్ణమూర్తి, పద్మ సుబ్రహ్మణ్యం మొ|| వారు.

Kathakali
3. కధకళి

భారతదేశంలో “కేరళ” రాష్టానికి చెందిన నాట్యం కధకళి. ఇందు ఆంగికాభినయం ప్రధానంగా ఉంటుంది. దీనికి కూడా భరతుని నాట్యశాస్తరమే మూలము అయినా అభినయ పద్ధతిలో కొన్ని మార్పులు ఉంటాయి. కధకళి అనగా కధను ఆట రూపములో చూపుట అని అర్ధం. స్త్రీ, పురుష పాత్రలను పురుషులే ధరిస్తారు. రౌద్ర, వీర, భయానక, భీభత్స రసములు ప్రధాన్యములు. వీరి వస్త్రధారణ బహు చిత్రమ ఉంటుంది. ముఖజాభినయము(Facial Expression) మరి ముఖ్యంగా నేత్రములతో చేయు అభినయం కడు సమర్ధవంతము. పాత్ర యొక్క స్వభావము, రసమును బట్టి ముఖానికి రంగులు వాడుతారు. పురుష వేషములకు గడ్డము చుట్టూ “చుట్టి” అనే తెల్లని వరిపిండితో చేసిన అట్ట వంటి పదార్ధమును రెండు చెంపలు ఒకదానికొకటి అంటుకునే వరకు అలదుట వలన నోరు తెరుచుటకు అవకాశము ఉండదు

Mohiniyattam
మోహినీ ఆట్టము

16వ శతాబ్దానికి ప్రాచుర్యంలో గల కేరళ రాష్ట్రనికి చెందిన స్త్రీలు మాత్రమే ప్రదర్శించే కళారూపం మోహినీ ఆట్టము. లస్య ప్రధానమైన, ఆలయ సంప్రదాయ నృత్యం. మోహినీ వలె అందముగా ఉన్న స్త్రీలు చేయు ఆట కావున “మోహినీఆట్టము అంటారు. కధకళి వలె ఇది కూడా ప్రాచీనమైన కళారూపం. ఇది చొల్లు కట్టు, జతిస్వరం, వర్ణం, తిల్లానా, నారాయనీయం, గజేంద్రమోక్షం వంటి అంశాలు ప్రదర్శింపబడతాయి.

ఆహార్యం: మనోహరమైన తెల్లని మెరిసే దుస్తులతో చక్కని కేశాలంకారణతో తలపై ఒకపక్క కొప్పును చుట్టి దానికి తెల్లని పువ్వులను అలంకరించి నడుముకు పట్టేడ (వడ్డాణం) చేతికి లావుగా ఉన్న గాజులు ధరిస్తారు. ఈ నాట్యరీతికి ఆదిగురువు శ్రీమతి పేరింగొట్టు కురిసి కళ్యాణి అమ్మ.

Odyssey
ఒడిస్సీ నృత్యం

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఈ నృత్యము నందు శివ, వైష్ణవ సంప్రదాయములు రెండు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది లస్య పద్ధతి. హస్త, పాద, అభినయం విషయంలో కూచిపూడి, భరతనాట్య లక్షణములు కనబడతాయి. పూరీ జగన్నాధ దేవాలయంలో ఈ ఒడిస్సీ నాట్యం చేస్తారు. మహారీలు అని పిలువబడే దేవదాసీలు చేయు నాట్యము కనుక మహరి నాట్యం అని కూడా అంటారు. పద్మశ్రీ గురు కేలు చరణ్ మహాపత్ర గారు ఒడిస్సీ నృత్యమును శాస్త్రీయతకు దగ్గరగా మలిచిన కళామూర్తి.

manipuri
మణిపురి

 ఇది అస్సాం, మణిపుర్, బెంగాల్ కు చెందిన సప్రదాయ నృత్యం. స్త్రీలచే లలితంగా సున్నితంగా అభినయించే పద్ధతి ఇది. ఇందులో సీమితాంగం, సర్పితాంగం అని రెండు లస్య పద్ధతులు ఉన్నాయి. గుంఠిన, చలనం, ప్రసారణం అనేవి మూడు తాండవ పద్ధతులు. రకరకాల రంగులు, అడ్డములతో కుట్టబడిన బుట్టాల వంటి లంగాలు ధరించి, శిరోజాములు శివుని జటాజూటం వలె పైకి ఎగదువ్వి, నది నెత్తి పైన గోపురం ఆకారంలో అలంకారం చేసుకుంటారు. మేలి ముసుగు ధరిస్తారు.

KATHAK
కథక్

ఉత్తర భారతదేశ సంప్రదాయ కళారూపం కథక్. కథ చెప్పేవాడిని కథకుడు అంటారు. ఈ పదం నుండి పుట్టినదే “కథక్” శబ్దం. ఈ రీతిలో పడవిన్యాసం మెల్లమెల్లగా మొదలై వేగాన్ని పుంజుకుని ఉధృతంగా మారుతుంది. రస, భావములు, హస్త అభినయములు తక్కువ. భ్రమరి విన్యాసం(గుండ్రంగా తిరుగుట) ఎక్కువ కనిపిస్తుంది. ఇది హిందూ, మొగలాయిల కళా సమ్మిళితము. పాదాభినయము ప్రధానము. కథక్ కళాకారులు ఏ తాలములోనైనా గంటల తరబడి నృత్యం చేయుట చూడవచ్చు. కథక్ సంప్రదాయంలో రెండు ఘరానాలు (బాణీ/శైలి) కలవు. 1. జైపూర్ ఘరానా, ఇది హైందవ పోకడలు ఎక్కువ గల పద్ధతి. 2. లక్నో ఘరానా, ఇది మహమ్మదీయ పోకడలు ఎక్కువగా గల పద్ధతి.

By admin