అసంయుత హస్తములు

Back to Main Page

శ్లో :          పతాకః త్రిపతాకోర్ధ పతాకః కర్తరీముఖ:

మయూరాఖ్యోర్ధ చంద్రశ్చాప్యరాలః శుకతుండకః

ముష్టిశ్చ శిఖరాఖ్యశ్చ కపిత్థః కటకాముఖః

సూచీచంద్రకలాపద్మ కోశః సర్ప శిరస్త ధా       

మృగ శీర్షః సింహముఖః కాంగూలశ్చాల పద్మకః

చతురోభ్రమరశ్చైవ హంసాస్యో హంసపక్షకః

సందంశో ముకులశ్చైవ తామ్రచూడః త్రిశూలకః

ఇత్యసంయుత హస్తానా మష్టా వింశతి రీరితా

1.పతాకము                          2.త్రిపతాకము                       3.అర్ధపతాకము                    4. కర్తరీముఖము

5.మయూరము                    6.అర్ధచంద్రము                   7. అరాలము                         8. శుక తుండము

9.ముష్టి                                10. శిఖరము                           11. కపితము                          12.కటకాముఖము

13.సూచి                               14. చంద్రకళ                         15. పద్మకోశము                   16. సర్పశీర్షము

17.మృగశీర్షము                   18. సింహముఖము               19. కాంగూలము                  20. అలపద్మము

21.చతురము                       22. భ్రమరము                      23. హంసాస్యము                24. హంస పక్షము

25.సందంశము                    26. ముకులము                   27. తామ్రచూడము             28. త్రిశూలము

లక్షణములు- వినియోగములు

1.పతాకము: బొటనవ్రేలు వంచి, తక్కిన నాలుగు వ్రేళ్ళను దగ్గరగా చేర్చి చాచినట్లయితే పతాక హస్తము ఏర్పడుతుంది.

వినియోగము: నాట్య ప్రారంభము, మేఘం, వనం, వస్తువులను నిషేధించడం, రాత్రి, నది, దేవతా సమూహం, వాయువు, శయనించడం, ప్రతాపము, తలుపు తెరవడం, అలలు, శపధం, ఆశీర్వాదం. తాళపత్రం, దాలు, చెంపపెట్టు, సంబోధన, మొదలగునవి.

  1. త్రిపతాకము: పతాక హస్తంలోని అనామికను వంచితే అది త్రిపతాక హస్తం. అవుతుంది.

వినియోగము: కిరీటము, వృక్షభావన, వజ్రాయుధం, ఇంద్రుడు, దీపం, అగ్నిజ్వాలలు, బాణం క్షత్రియజాతి, మొదలగునవి.

  1. అర్ధ పతాకము : త్రిపతాక హస్తము లోని చిటికెన వేలిని వంచితే అర్ధపతాకము ఏర్పడుతుంది.

వినియోగం : చిగురు, పలక తీరం, ఇద్దరు అని చెప్పడం, ధ్వజం, గోపురం, మొదలగునవి.

  1. కర్తరీముఖము: త్రిపతాక హస్తములోని తర్జనినికనిష్టికను బయటకు చాచితే ‘కర్తరీముఖము’ ఏర్పడుతుంది.

వినియోగం : స్త్రీ పురుషులు ఎడబాటు, వ్యతిరేకత, వెనుకకు తిరగటం, దొంగిలించడం, కనుకొలకులు, మరణం, భేదించటం, ఒంటరిగా శయనించడం, తీగె, చదవటం, దంపతులు విరహం, విష్ణువు, లేడి, వింజామర, క్షత్రియుడు మొదలగునవి.

  1. మయూరము: పతాక హస్తములోని అనామిక- అంగుష్టాలు కలిస్తే మయూర హస్తం ఏర్పడుతుంది.

వినియోగం : నెమలి ముఖం, తీగె, ముంగురులు సరిదిద్దటం, లలాట తిలకం, శాస్త్ర చర్చ, ప్రసిద్ధ విషయము మొదలగునవి.

  1. అర్థచంద్రము: పతాక హస్తములోని బొటన వ్రేలిని దూరంగా దాచితే అర్థ చంద్ర హస్తం ఏర్పడుతుంది.

వినియోగం: అష్టమినాటి చంద్రుడు, మెడపట్టి గెంటటం, పుట్టుక, మొల, చింత, ధ్యానం, అర్ధించటం, మణికట్టు, నడుము కట్టు బిగించటం, కుండలు చేయటం, శరీరం, ఎత్తుకొనుట మొదలగునవి.

  1. ఆరాలము: పతాక హస్తములోని తర్జనిని వంచితే అరాలహస్తం ఏర్పడుతుంది.

వినియోగం: విషం, అమృతం మొదలగునవి త్రాగటం, ప్రచండముగా వీచేగాలి. అవపోశనం, వేగంగా రమ్మనటం, మొనవి.

  1. శుకతుండము: అరాల హస్తములోని అనామికను వంచితే శుకతుండ హస్తము ఏర్పడుతుంది.

వినియోగం: బాణ ప్రయోగం, మర్మపు మాట, తీక్షణ భావం, కలహం, ఈటె, చిలుకలు, గోరువంకలు మొ||నవి.

  1. ముష్టి: నాలుగు వ్రేళ్ళను దగ్గరగా చేర్చి అరచేతిలోనికి వంచి వాటిపై బొటనవ్రేలు చేర్చితే అది ముష్టి హస్తం అవుతుంది.

వినియోగం: స్థిరత్వం, ధృడత్వం, మల్లయుద్ధం, వడిగా పరుగెత్తటం, మొదలగునవి.

  1. శిఖరం: ముష్టి హస్తంలోని అంగుష్టం పైకి ఎత్తబడితే శిఖర హస్తం ఏర్పడుతుంది.

వినియోగం: మన్మధుడు, ధనుస్సు, స్తంభము, నిశ్చయం, విశ్శబ్దం, పితృ తర్పణం, దంతం, చిహ్నం శివలింగం, భర్త, నడుము కట్టు లాగటం, మొదలగునవి.

11.పిత్థము: శిఖర హస్తమందలి అంగుష్టం మీదకు తర్జని వంగితే కపిత్థ హస్తం అవుతుంది.

వినియోగం : లక్ష్మి, సరస్వతి, చుట్టటం, తాళం పట్టుకొనటం, పాలు పిదుకటం, వస్త్రంతో ముసుగు వేసుకొనటం మొదలగునవి.

  1. కటకాముఖము: కపిత్థ హస్త మందలి తర్జని చివర బొటన వ్రేలితో కలిస్తే అది కటకాముఖ హస్తం అవుతుంది.

వినియోగం: పువ్వులు కోయటం, ముత్యాల దండలు పూలదండలు ధరించటం, బాణమును మెల్లగా లాగటం, మాట, చూపు, పూలు కోయటం, విల్లు ఎక్కుపెట్టటం మొదలగునవి.

  1. సూచీ: ముష్టి హస్తమందలి తర్జనిని ప్రసారితము చేసినచో సూచీ హస్తము ఏర్పడును.

వినియోగం: ఒకటి, పరబ్రహ్మ, నూరు, సూర్యుడు, లోకం, భయపెట్టు. సన్నబడుట, ఆశ్చర్యం గొడుగు, సమూహం, నిజం. ఒకటి, చక్రం త్రిప్పుట మొదలగునవి.

  1. చంద్రకళ: సూచీ హస్త మందలి బొటన వ్రేలిని చాచితే చంద్రకళ ఏర్పడుతుంది.

వినియోగం : చంద్రుడు, ముఖము, శివ జటాజూటం, దండం మొదలగునవి.

  1. పద్మకోశం : వ్రేళ్ళు ఎడంగా వున్నవి అరచేతి లోనికి కొంచెం వంగినవి అయితే పద్మకోశ హస్తం ఏర్పడుతుంది.

వినియోగం: పండు, స్త్రీల కుచ కుంభములు, బంతి, పూలచెండు, భుజించటం, మామిడిపండు, ఏనుగు తొండం, లావణ్యం మొదలగునవి.

  1. సర్పశీర్ష ము: పతాక హస్తపు వ్రేళ్ళు చివరలు వంగితే సర్పశీర్ష హస్తం ఏర్పడుతుంది.

వినియోగం: గంధం, పాము, మంద్రస్వరం, నీళ్ళు చిలకరించటం, పోషించటం తర్పణం విడవటం, ఏనుగు చెవులను ఆడించటం మొదలగునవి.

  1. మృగశీర్షము: సర్పశీర్ష మందలి చిటికెన వ్రేలిని బొటన వ్రేలినిచాచితే మృగ తీరము ఏర్పడుతుంది.

వినియోగం: విషయం, చెక్కిలి, హద్దు, తగువు, వేషధారణ, లేడి ముఖం, పాదములు వత్తటం. ప్రియులను పిలవటం, సంచారం, వితర్కం, ఋషిజాతి, తెలుపురంగు మొదలగునవి.

  1. సింహముఖము: అంగుష్టము, నడిమివేలు ఉంగరపు వ్రేలు యొక్క చివరలతో కలిసి, తక్కిన రెండు వ్రేళ్ళు ప్రసారితం అయితే అది సింహముఖము అవుతుంది.

వినియోగం : కుందేలు, సింహముఖము, శోధించటం, హోమం, పద్మముల దండ మొదలగునవి.

  1. కాంగూలము: పద్మకోశ మందలి అనామిక వంచబడితే అది కాంగూలము అవుతుంది.

వినియోగం : నిమ్మపండు, బాలికాకుచము, ఎర్రకలువ, చిరుగజ్జెలు, మొదలగునవి.

  1. అలపద్మము : చిటికెన వ్రేలు మొదలగు వ్రేళ్ళు మధ్య సందులు వుండునట్లుగా కొంచెం వంచబడితే అది అల పద్మహస్తము అవుతుంది.

వినియోగం : వికసించిన పద్మము, వెలగ మొదలగు పండ్లు, కుచం, ఊరు, ఎత్తు, కోపం, చెరువు, బండి, కలకలధ్వని, పొగడ్త, వెన్నముద్ద, తల, కుడుము, కిరీటము, నర్తనం మొ||నవి..

  1. చతురము : పతాక హస్తములోని తర్జని మొదలగు మూడు వ్రేళ్ళు దగ్గరకు చేరినవి. చిటికెన వ్రేలు చాచబడినది, ఉంగరపు వ్రేలు మొదలగునవి. బొటన వ్రేలు అడ్డంగా వుంచబడినది అయితే అది చతుర హస్తం అవుతుంది.

వినియోగం: కస్తూరి, కొంచెం, బంగారము, రాగి, ఇతర లోహములు, కన్ను, ప్రమాణము, ముక్కలు చేయటం, నేయి, నూనె, మొదలగు ద్రవ పదార్థాలు మొదలగునవి.

  1. భ్రమరము : నడిమి వ్రేలు, బొటన వ్రేలు కలిసినవి, చూపుడు వ్రేలు వంగినది. తక్కిన రెండు వ్రేళ్ళు ప్రసారితములు అయితే అది ‘భ్రమరము’ అవుతుంది.

వినియోగం: తుమ్మెద, చిలుక, యోగాభ్యాసం, సారస పక్షి, కోకిల, గజ దంతం మొదలగునవి.

23.హంసాస్యము : నడిమి వ్రేలు మొదలు కొని మూడు వ్రేళ్ళు ఎడం ఎడంగా చాచినవి కాగా, చూపుడు వ్రేలు బొటన వ్రేలు చివర కలిస్తే అది హంసాస్య హస్తం అవుతుంది.

వినియోగం: దండం పట్టుకొనటం, పని పూర్తి కావటం, జ్ఞానోపదేశం, పూజ, మాట్లాడటం, పఠించటం, పాడటం, ధ్యానం చేయడం, వేణుగానం చేయడం మొదలగునవి.

  1. హంసపక్షము: సర్పశీర్షమందలి చిటికెన వ్రేలు బాగా ప్రసారితమైతే అది హంస పక్ష హస్తము అవుతుంది.

వినియోగం: ఆరు అనెడి సంఖ్య. గోటి నొక్కు గుర్తు, మంగళప్రదమైన నాట్యం, వీణ వాయించటం, చిత్ర లేఖనం, అప్సరస జాతి మొదలగునవి.

  1. సందంశము : పద్మ కోశమందలి వ్రేళ్ళను మరల మరల దగ్గరకు చేర్చి, దూరం చేస్తూవుంటే సందంశము అవుతుంది.

వినియోగం : పొట్ట లేదా త్యాగం, బలిదానం, పుండు, పురుగు, మహాభయం. అర్చించటం, ఐదు అనే సంఖ్య, జందెం, గీత, గాయం, జారడం, బొట్టు, మొదలగునవి.

  1. ముకుళము : ఐదు అంగుళులను చివరలందు కలిపి ప్రదర్శించితే అది ముకుల హస్తం అవుతుంది.

వినియోగం: కలువపూవు, భోజనం, మన్మధుడు, ముద్రాదులు, ధరించటం, దానం చేయటం, జపం, తామర మొగ్గ, బిడ్డలను ముద్దు పెట్టుకొనటం మొదలగునవి.

  1. తామ్రచూడము: ముకుళ హస్త మందలి తర్జనిని వంచిపడితే అది తామ్ర చూడ హస్తము అవుతుంది.

వినియోగం : కోడి, కొంగ, కాకి, ఒంటె, దూడ, వ్రాయటం మొదలగునవి.

  1. త్రిశూలము : బొటన వ్రేలిని, చిటికెన వ్రేలిని వంచితే త్రిశూల హస్తం. ఏర్పడుతుంది.

వినియోగం: మారేడుదళం, మూడింటి కూడిక, త్రిశూలము, మూడు లోకాలు, మూడు అని లెక్కపెట్టుట దేవజాతి మొదలగునవి.

Back to Main Page

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *