కూచిపూడి వారి పగటి వేషాలు – ఒక జానపద కళా సంప్రదాయం


కూచిపూడి వారి పగటి వేషాలు – ఒక జానపద కళా సంప్రదాయం

కూచిపూడి గ్రామానికి చెందిన కళాకారులు కేవలం కూచిపూడి నాట్యంలోనే కాకుండా పగటి వేషాలు అనే జానపద కళారూపంలో కూడా అసాధారణ ప్రతిభను ప్రదర్శించినవారిగా ప్రసిద్ధి చెందారు. ఈ పగటి వేషాలు ప్రజల మధ్య తిరుగుతూ సామాజిక చైతన్యాన్ని కలిగించే ఒక ప్రత్యేక నాట్య-నాటక సంప్రదాయంగా చెప్పవచ్చు.

ఈ పగటి వేషాల ప్రదర్శనలు మొదటగా కృష్ణా జిల్లాలోని గడ్డిపాడు (హనుమంతపురం) అగ్రహారంలో ప్రదర్శింపబడేవి. అనంతరం కూచిపూడి గ్రామంలోని కొంతమంది కళాకారులు కలిసి మేళాలు (బృందాలు) ఏర్పాటు చేసుకుని, ఒక్కొక్క మేళానికి ఒక నాయకుడు ఉండేవాడు. ఈ మేళాలను ఆయా నాయకులు ముందుండి నడిపించేవారు, ఈ కళాకారులు గ్రామం నుంచి గ్రామానికి కాలినడకన ప్రయాణిస్తూ తమ కళను ప్రదర్శించేవారు.

పట్టపగలే వేషధారణ చేసి, హావభావాలతో, రాగ-తాళాలతో, హాస్య వ్యంగ్యాలతో ప్రజలను ఆకట్టుకోవడం పగటి వేషధారుల ప్రత్యేకత. వారు కేవలం వినోదం మాత్రమే కాకుండా, సమాజంలోని దురాచారాలు, బలహీనతలు, అజ్ఞానం వంటి అంశాలను వ్యంగ్యంగా ప్రదర్శించి ప్రజలకు అవగాహన కలిగించేవారు.

అభినయం, వాక్చాతుర్యం, ఇతరుల మాట తీరు మరియు ప్రవర్తనను అచ్చం అనుకరించే నైపుణ్యం ఈ కళాకారులలో ప్రత్యేకంగా కనిపించేది.

నాటకాలు, సినిమాలు, రేడియో, టెలివిజన్ వంటి ఆధునిక వినోద మాధ్యమాలు అభివృద్ధి చెందకముందు కాలంలో, గ్రామీణ భారతదేశంలో ప్రజలను విరివిగా అలరించిన జానపద కళారూపాలలో పగటి వేషాలు ముఖ్యమైన స్థానం పొందాయి.

పగటి వేషధారులు – కూచిపూడి వారు

మొదటి తరం

పసుమర్తి శేషయ్య, పసుమర్తి చలపతి, వేదాంతం పెద రామయ్య, వేదాంతం నీలకంఠయ్య, వేదాంతం పేరయ్య, భాగవతుల కుమారస్వామి, భాగవతుల పిచ్చయ్య, భాగవతుల యల్లయ్య, భాగవతుల కామయ్య, భాగవతుల నాగలింగయ్య, భాగవతుల రామలింగం, భాగవతుల రామదాసు, ఏలేశ్వరపు వెంకటనారాయణ, ఏలేశ్వరపు కృష్ణయ్య, తాడేపల్లి సూరయ్య, దర్భా లింగయ్య, మహంకాళి లక్ష్మయ్య, వేము ఆదినారాయణ, హరిలక్ష్మీనారాయణ.

రెండవ తరం

పసుమర్తి రామయ్య, పసుమర్తి ఆంజనేయులు, పసుమర్తి సత్యనారాయణ, వేదాంతం సాంబయ్య, వేదాంతం వెంకట రత్నయ్య, వేదాంతం సత్యనారాయణ, వేదాంతం లక్ష్మీనరసింహం, వేదాంతం ఘంటయ్య, వేదాంతం వెంకటేశ్వర్లు, భాగవతుల జగ్గయ్య, భాగవతుల అనంతయ్య, భాగవతుల ఆదినారాయణ, ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు, ఏలేశ్వరపు పున్నయ్య, ఏలేశ్వరపు ఆంజనేయులు, ఏలేశ్వరపు నారాయణమూర్తి, హేమాద్రి వెంకటేశ్వర్లు, హేమాద్రి శివయ్య, దర్భా దుర్గయ్య, దర్భా కృష్ణయ్య, మహంకాళి పెదసత్యనారాయణ, మహంకాళి సుబ్బరామయ్య, చింతా శివరామయ్య.

మూడవ తరం

పసుమర్తి విశ్వనాథం, పసుమర్తి శ్రీరామమూర్తి, పసుమర్తి సూర్యనారాయణ, వేదాంతం పార్థసారథి, వేదాంతం శ్రీమన్నారాయణ, వేదాంతం మల్లిఖార్జున శర్మ, భాగవతుల నాగలింగయ్య, భాగవతుల వెంకటరాజయ్య, ఏలేశ్వరపు ప్రకాశరావు, శివరామయ్య రాఘవయ్య, శ్రీరామమూర్తి, తాడేపల్లి సుబ్బయ్య, తాడేపల్లి చంద్రయ్య, హేమాద్రి శివరామకృష్ణ శర్మ, మహంకాళి కృష్ణమూర్తి, చింతా సూర్యప్రకాశం, బాలకృష్ణయ్య, జోశ్యుల దుర్గయ్య,

కూచిపూడి వారి పగటి వేషాలు

1. బైరాగి

2. ఫకీరు

3. బుడబుడబుక్కల

4. జంగం

5. వైష్ణవులు

6. కోయ

7. బ్రాహ్మణ వితంతువు

8. కోమటి

9. సోమయాజులు – సోమదేవి

10. దాష్టీకం పంతులు

11. ముసలి మొగుడు

12. గొల్లబోయడు

13. గయ్యాళీ పెళ్ళాం

14. కాశీ కావడి

15. మరాఠీ దండు

16. బోడిగాడు

17. శారద వేషం

18. మాదిగ వేషం

19. అర్థనారీశ్వరుడు

20. మందుల వేషం

21. పాములవాని వేషం

22. దేవర పెట్టి

23. పిట్టలదొర

24. భేతాళ

25. గంగిరెద్దు

26. శక్తి

27. హెచ్చరిక వేషాలు

28. అత్త – కోడలు

29. వానలమ్మ

30. ఎరుకుల సాని

శారద వేషం – చివరి రోజు సంప్రదాయం

పగటి వేషాల ప్రదర్శనలు సాధారణంగా పది రోజుల పాటు ఒకే గ్రామంలో జరుగుతాయి. రోజుకి ఒక్కొక్క వేశం వేస్తూ, పదవ రోజున శారద వేషం ధరించి కళాకారులు గ్రామస్థుల ముందుకు వచ్చి పాటలు పాడుతూ, ఆశీర్వచనాలు చెబుతూ బహుమతులు స్వీకరించేవారు.

శారద వేషం – శబ్దములు

హద్దూ!

ఇది నాలుగు జాముల పొద్దూ

మమ్మెగదిగ జూడా వద్దూ

ఈ ముతక శాలువ మా కొద్దూ

దుశ్శాలువ ఇస్తే మా పద్దూ

ఔ శారదా! కరుణానిధీ!

హాడూ!

ఈ జగముల మీదే హాడూ

మీ అన్నదమ్ముల జోడూ

మీ చెవులకు ఉన్నా జోడూ

నా చెవులకు పెట్టి చూడూ

ఔ శారదా! కరుణానిధీ!

వారం!

ఇది త్రిపురాసుర సంహారం

మేం కులమున బ్రాహ్మణవారం

మే ముండేది కృష్ణాతీరం

మాది కూచిపూడి అగ్రహారం

మీ మెడలోని చంద్రహారం

ఆ హారం ఇస్తే మీ భారం(మీ వారం)

ఔ శారదా! కరుణానిధీ!

Loading

Scroll to Top