శ్రీ సిద్ధేంద్ర యోగి జీవిత చరిత్ర

కూచిపూడి నాట్య కులానికి ఆరాద్యుడైన శ్రీ సిద్ధేంద్రుల వారి జీవిత చరిత్రకు సంబంధించిన ఆధారములు స్వల్పము. కానీ వాడుకలో ఉన్న ప్రకారం, కూచిపూడి గ్రామమున జన్మించిన సిద్దేంద్రుడు చిన్నతనముననే చదువు సంధ్యలు మాని నాట్యకళను అభ్యసించి నాట్యమేళములో సభ్యునిగా తిరిగెడివాడు. ఈయన తల్లి తండ్రి ఎవరో తెలియదు. సిద్దయ్య యౌవన వయస్కుడయినాడు. ఆనాడు కూచిపూడి అగ్రహారములోని ఒక బీద బ్రాహ్మణుడు తన కుమార్తెకు తగిన వరాన్వేషణలో విసిగి వేసారి తుదకి సిద్దయ్య కీయ సంకల్పంచాడు. ఆ బీద బ్రాహ్మణుని పేరు కూచెయ్య అని అంటారు. చదువు సంధ్యలు లేని సిద్దయ్యకు వివాహమా? అని అతని మిత్రులు హేళన చేయగా వివాహానంతరము సిద్దయ్య పట్టుదలతో విద్యను అభ్యసించి పండితుడు కావలెననే లక్ష్యముతో ఒక అర్ధరాత్రి ఎవరితోను చెప్పకుండా కృష్ణా నది దాటి అక్కడి నుండి ఎక్కడికో పోయి విద్యాభ్యాసము చేసి కావ్యాలు కంఠస్థము చేసి, వేదాన్ని వల్లె వేసి నాట్యశాస్త్రమును పఠించి గురువుగారి మెప్పు పొంది సిద్దయ్య సిద్ధేంద్ర నామధేయుడై స్వగృహమునకు బయలుదేరెను. కృష్ణ దాటి ఇంటికి రావలయును. కావున కృష్ణ దాటుచుండగా వరద ఉదృతమై ప్రాణాప్రాయస్థితి సంభవించే సరికి ఆతుర సన్యాసము స్వీకరించెను. అందువలన సిద్ధేంద్రుడు యోగి అయినాడు. ఆతుర సన్యాసము విధి విహితమనుకొను విధముగా సన్యసించు సరికి కృష్ణ ఉద్ధృతి తగ్గి ఒడ్డుకు యోగి పుంగవుడై చేరినాడు. గృహమున చేరిన సిద్దేంద్రుని అత్తమామలు యధావిధి ఉచిత రీతిన సత్కరించగా భార్య మాత్రము దూరదృష్టిచే సిద్దేంద్రుని ఆతుర సన్యాసము గ్రహించెను. తన భార్య యొక్క దూరదృష్టిని మొచ్చుకొని సిద్దేంద్రుడు నాట్యసమాజ సభ్యులను పరామర్శించుటకు వెళ్లి వారితో నాట్య చర్చలో పాల్గొని నాట్య సమాజ పరిస్థితులను శాస్త్ర విషయములను చర్చించి లోక కళ్యాణము కొరకు ఇహపర సౌఖ్యములను ముక్తిదాయకమైన ప్రబంధములను రూపొందించి ప్రజలలో అద్వైత మత వ్యాప్తికి కంకణము కట్టవలెనని సంకల్పించెను. అంతేగాక శాస్త్రములచే కడుగబడిన ముత్యము వంటి మనస్సు గల సిద్ధేంద్రయోగి నాట్యశాస్త్రములో నాట్యధర్మి విధాన్యమును అనుసరించి లోక విషయమగు అద్వైత మతమును దృష్టిలో వుంచుకొని భామాకలాపమును రచించెను. ఆనాటి నుండి కూచిపూడి నాట్య వైభవము ప్రత్యేకతను సంతరించుకొన్నది. సిద్దేంద్రుని ఆవిర్భావము కూచిపూడి నాట్యకళ అజరామరమై సమస్త రాజన్యుల చేత ప్రోత్సహించబడినది. పురుషులే స్త్రీ వేషము వేయవలెను అనే భరతుని నాట్యధర్మి లక్షణమును సిద్దేంద్రుడు ఆచరణలో పెట్టెను. నేటికి ఆ సంప్రదాయము అమలు జరుగుచున్నది. అటువంటి సిద్దేంద్రుడు యోగియై కూచిపూడి నాట్యపితామహుడైనాడు.
మరొక గాధను పరిశీలించిన విద్యాభ్యాసము కొరకు సిద్ధేంద్రుడు కాశీకి వెళ్ళి అచ్చట నారాయణ తీర్ధుల వారితో పరిచయము ఏర్పాటు చేసికొని యుండును. విద్యాభ్యాసానంతరము యిరువురు కలిసి కృష్ణ దాటుతుండుగా కృష్ణ ఉప్పొంగియుండును. వారిరువురు ఆతుర సన్యాసము తీసుకొనెనని వారి జీవిత చరిత్ర తెలుపుచున్నది. అదియును గాక శ్రీకృష్ణలీలా తరంగిణి యందు నాట్యము చేయుటకు అనుగుణముగా జతులు కట్టబడినవి. మరియు తీర్ధుల వారు పారిజాతాపహరణం రచించినట్లు యున్నది. తదనంతరము వచ్చు గాధ “భామాకలాపము”నకు యితివృత్తముగా పేర్కొనబడినది. అందువలన వారిరువురు గురుశిష్యులై యుందురని పై విషయములు తెలియబరచుచున్నవి.
Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *